*హనుమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు-భారీ అవినీతి బట్టబయలు*

ప్రజా గొంతుక ఏప్రిల్ 3 వరంగల్ ప్రతినిధి:హనుమకొండ జిల్లా వరంగల్(ఆర్ ఓ)సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో భారీ అవినీతి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాయి.ఏప్రిల్ 2న నిర్వహించిన ఈ దాడుల్లో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి.తనిఖీల సమయంలో కార్యాలయంలో అనుమతి లేకుండా తిష్ట వేసిన 20 మంది దళారులు/డాక్యుమెంట్ రైటర్లను గుర్తించి పట్టుకున్నారు.వారి వద్ద నుండి లెక్కల్లో చూపని రూ.47450 నగదు,అలాగే 70 రిజిస్ట్రేషన్ కు సంబంధించినవి కానీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.దళారుల మొబైల్ ఫోన్లను పరిశీలించగా,సబ్ రిజిస్టర్ అధికారులు జమలాపురం రామనరసింహారావు(ఎస్.ఆర్.ఓ 1)దావులూరు ఆనంద్(ఎస్ ఆర్ ఓ 2)లతో జరిగిన వాట్సాప్ చాట్లు వెలుగులోకి వచ్చాయి.వీటి ఆధారంగా గత ఏడాది కాలంలో ఫోన్ పే ద్వారా దాదాపు రూ.42,03,125(42 లక్షలు)లంచాల రూపంలో లావాదేవిలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.ఇంకా,కార్యాలయంలో 204 డెలివరీ చేయని రిజిస్టర్డ్ పత్రాలు అధికారుల వద్దే ఉండడం గమనార్హం.ఇది విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి ఉదాహరణంగా అధికారులు పేర్కొన్నారు.ఇదే సమయంలో సబ్ రిజిస్టర్ల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.24,61,540 నగదు,బంగారం,2.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.అదనంగా కపిల్ చిట్స్ లో 30,10,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా గుర్తించారు.తనిఖీల సందర్భంగా మరికొన్ని అక్రమాలు బయటపడినట్లు(ఏసీబీ)అధికారులు తెలిపారు. మొత్తం వ్యవహారం పై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.











