*రాయికల్లో “కేంబ్రిడ్జ్ ప్లే స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాల” మూసివేత*
*గుర్తింపు లేకుండా తరగతులునిర్వహిస్తున్న సంస్థపై విద్యాశాఖ చర్యలు*
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్
రాయికల్ పట్టణంలో కేంబ్రిడ్జ్ ప్లే స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాల”పై మండల విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఆ పాఠశాలను
సోమవారం మూసివేశారు. గుర్తింపు లేకుండా చిన్నారులకు విద్యాబోధన నిర్వహిస్తున్నట్లు తెలిసి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే, గత విద్యాసంవత్సరం వరకు రాయికల్లో నిర్వహించబడిన కేంబ్రిడ్జ్ స్కూల్ ప్రస్తుత విద్యాసంవత్సరానికి రామాజిపేట్ గ్రామంలో అధికారిక గుర్తింపుతో కొనసాగుతోంది. అయితే అదే పాఠశాల పాత భవనాన్ని ఉపయోగించి రాయికల్లో మళ్లీ “కేంబ్రిడ్జ్ ప్లే స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాల”గా కొంతమంది నిర్వాహకులు అనధికారంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వచ్చింది.ఈ పాఠశాలలో సుమారు 25 మంది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల విద్యార్థులతో బోధన జరుగుతున్నట్లు పరిశీలనలో తేలింది. సరైన అనుమతులు, గుర్తింపు లేకుండా పాఠశాల నడపడం విద్యా నియమావళికి విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మండల విద్యాధికారి ఆధ్వర్యంలో అధికారులు పాఠశాలను తనిఖీ చేసి,తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. అనంతరం ఆ పాఠశాల కార్యకలాపాలను నిలిపివేయించి, చిన్నారుల భద్రత, విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.మండల విద్యాధికారి మాట్లాడుతూ, గుర్తింపు లేని పాఠశాలలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే చేర్పించి, వారి భవిష్యత్తును సురక్షితం చేయాలని సూచించారు.విద్యా ప్రమాణాలను కాపాడటంతో పాటు, చిన్నారుల విద్యలో ఎలాంటి లోపాలు రాకుండా ఉండేందుకు విద్యాశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.











