కొత్తపల్లిలో ప్రారంభమైన మొదటి విడత జనగణన…..
నల్గొండ జిల్లా ప్రతినిధి) షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే: 11రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ దేశ జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దశలో ఇండ్ల గణన (హౌస్ లిస్టింగ్) మాత్రమే నిర్వహించబడుతోంది. అనంతరం వచ్చే ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే రెండో దశలో జనగణన చేపట్టనున్నారు.ఈ నేపథ్యంలో కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మొదటగా ఇండ్ల గణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఇండ్లకు జనగణన నంబర్లను కేటాయిస్తున్నారు. మూడు రోజుల పాటు ఇండ్లను గుర్తించడం, ఇండ్ల సంఖ్యను లెక్కించడం, వాటి ఆధారంగా గ్రామ మ్యాప్ రూపొందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
అనంతరం ఇండ్ల జనగణన సంఖ్య ప్రకారం జాబితా తయారు చేసి, సంబంధిత సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు ఏఎస్ఓ రవికుమార్ తెలిపారు. ఈ సర్వేలో మొత్తం 33 రకాల ప్రశ్నలు ఉంటాయని, వాటికి ప్రజలు సరైన సమాధానాలు ఇచ్చి సహకరించాలని కోరారు. ఇంటికి సంబంధించిన గచ్చు, పైకప్పు, గదుల సంఖ్య, నివాస మరియు నివాసేతర భవనాల వివరాలు తదితర అంశాలపై సమాచారం సేకరిస్తారని చెప్పారు. ప్రజలు నిజాయితీగా వివరాలు అందించి ఎన్యూమరేటర్లకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామ కార్యదర్శి రియాజ్, ఎన్యూమరేటర్లు లోక్యానాథ్, దివ్యలక్ష్మి, సరిత పాల్గొన్నారు.











