మాటూరు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు నగదు పురస్కారాలు
— ఘనంగా పదవ తరగతి ప్రతిభావంతుల సత్కారం
— కౌండిన్య కళ్యాణ వేదిక ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానం
మాటూరు,మే 19 (ప్రజా గొంతుక న్యూస్):రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) మోటకొండూర్ మండలం మాటూరులో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి,పాఠశాల కీర్తిని పెంపొందించిన విద్యార్థులను మంగళవారం ఘనంగా సత్కరించారు.కౌండిన్య కళ్యాణ వేదిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిభావంతులకు నగదు పురస్కారాలను అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరవెల్లి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.దాతల ఉదారత–విద్యార్థులకు ప్రోత్సాహంకౌండిన్య కళ్యాణ వేదిక ప్రతినిధి నరేందర్ సార్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.స్థానిక దాత గచ్చుబాయి నాగరాణి తమ కుమారుడు అంబట్ అయాన్ తేజ్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నగదు బహుమతులను స్పాన్సర్ చేశారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేందుకు ఇలాంటి ఆర్థిక సాయం ఎంతో దోహదపడుతుందని, దాతల ఉదారత అభినందనీయమని హెచ్ఎం శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: సర్పంచ్ జన్నె సిద్దులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ జన్నె సిద్దులు మాట్లాడుతూ… కష్టపడి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి వెన్నుముకగా నిలిచిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యంత నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలకు ఇంత మంచి ఫలితాలు రావడానికి అహర్నిశలు శ్రమించిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు.ఈ పురస్కారాల ప్రధానోత్సవంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్ల రమేష్,స్థానిక వార్డు సభ్యులు,పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, ప్రతిభ చాటిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











