ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలి కర్రె లక్ష్మణ్. మార్పుల ద్వారా పథకాన్ని పాడు చేయకండి
ప్రజా గొంతుక,ఎల్కతుర్తి, మే 19:మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించి, గ్రామీణ పేదల ఉపాధిని కాపాడాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) జిల్లా కార్యదర్శి కర్రె లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు తీసుకువచ్చి పేదల జీవనోపాధిని దెబ్బతీయొద్దని ఆయన హెచ్చరించారు.మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ఈ పథకం పేదలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు. కొత్త విధానాల వల్ల పేదలకు పని దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కూలీలకు గిట్టుబాటు అయ్యే విధంగా వేతనాలు చెల్లించాలని కోరారు. పని చేసే ప్రాంతాల్లో తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న కూలీల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పని కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు మునిగాల భిక్షపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదునూరి వెంకటరాజం, రాష్ట్ర సమితి సభ్యుడు మద్దెల ఎల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టు భిక్షపతి, జిల్లా నాయకురాలు జూకంటి పద్మ తదితరులు పాల్గొన్నారు.











