కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రైతన్నలకు కష్టాలు
— బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం
— ప్రతి గింజ కొనేవరకు, మద్దతు ధర దక్కేవరకు పోరాటం ఆపబోం: బీజేపీ స్పష్టీకరణ
ప్రజాగొంతుక ప్రతినిధి/జనగామ:
తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వారికి అండగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జనగామ జిల్లాలో బీజేపీ ప్రతినిధుల బృందం పర్యటించింది.జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో పార్టీ ప్రముఖ నాయకులు జనగాం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.మార్కెట్ ఆవరణలో ఉన్న వరి,మొక్కజొన్న రాశులను పరిశీలించి,కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం,ఎదురవుతున్న ఇబ్బందులపై రైతన్నలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య,ఉదాసీన వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు
ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాటల్లో…
“ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు తెరిచి,సరైన ఏర్పాట్లు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.భారతీయ జనతా పార్టీ ఈ రోజు కొనుగోలు కేంద్రాల పర్యటనను ప్రకటించిన తర్వాతే.. అకస్మాత్తుగా ఈ సమస్య తీవ్రతను గుర్తించి ప్రభుత్వం నిద్రలేచింది.బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రానికి చేరుకోవడానికి ముందే.. ఇన్నాళ్లూ పట్టించుకోని అధికారులు హడావిడిగా ధాన్యాన్ని ఎత్తి లారీల్లో నింపి,అంతా సక్రమంగానే జరుగుతోందనే ఒక భ్రమ కల్పించే ప్రయత్నాలు చేశారు.నిన్ననే కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు వచ్చాయని ఇక్కడి రైతులు మాకు స్వయంగా తెలిపారు.ధాన్యం ఎత్తడానికి లారీలు పంపుతున్నామని జిల్లా కలెక్టర్ తమకు హామీ ఇచ్చారని కూడా చెప్పారు.భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వచ్చి రైతుల పక్షాన ఈ సమస్యను బలంగా లేవనెత్తినందుకే ప్రభుత్వం దిగివచ్చి చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.లేకపోతే, ఆరుబయట పడి ఉన్న వరి, మొక్కజొన్న తదితర ధాన్యపు రాశులు వానకు తడుస్తూ,ఎండకు ఎండుతూనే ఉండేవి.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తగిన ప్రతిఫలం దక్కకుండా పోయేది.తెలంగాణ రైతుల హక్కుల సాధన కోసం భారతీయ జనతా పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుంది. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర దక్కే వరకు, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేసే వరకు మా పోరాటం ఆగదు.” అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి,రాకేష్ రెడ్డి,పాయల్ శంకర్,ఎమ్మెల్సీ అంజి రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు,రాష్ట్ర కార్యదర్శి కొప్పు బాషా,కిసాన్ మోర్చా అధ్యక్షులు లక్ష్మి నర్సయ్య,రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ రెడ్డి,లేగ రామ్మోహన్ రెడ్డి,ఉడుగుల రమేష్,బల్ల శ్రీనివాస్,బొజ్జపల్లి సుభాష్, పెరుమాళ్ళ వెంకటేష్,యుగేందర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి,అంజి రెడ్డి, భాగాల నవీన్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య,లక్ష్మారెడ్డి,సుజన్, ముత్యాలు,కిసాన్ మోర్చా నాయకులు వెంకట రెడ్డి,పట్టణ అధ్యక్షులు అనిల్,పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్, శివకృష్ణ మరియు వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











