బచ్చన్నపేట, జూలై 22 (దిశ పవర్):ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గాయపడిన ఘటనను బచ్చన్నపేట మండల సిద్ధులగుట్ట మాజీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు.మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు ఆముదాల మల్లారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమని, అలాంటి కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీపై దాడి జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పేపర్ లీకేజీ వంటి కీలక అంశంపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనను ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.











