తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మహ్మద్ అమ్జద్ పాషా నియామకం
దిశా పవర్, జనగామ
తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జనగామ జిల్లా ధర్మకంచెకు చెందిన మహ్మద్ అమ్జద్ పాషా నియమితులయ్యారు. పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సల్మాన్ ఉద్దీన్ అధికారిక నియామక పత్రాన్ని జారీ చేశారు.పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ సూచనల మేరకు, పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆమోదంతో అమ్జద్ పాషాను ఈ పదవికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాల వ్యాప్తికి ఆయన అంకితభావం, నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా సల్మాన్ ఉద్దీన్ ఆకాంక్షించారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ కోసం తనవంతు కృషి చేస్తా: మహ్మద్ అమ్జద్ పాషా
తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్నకు, మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సల్మాన్ ఉద్దీన్‌కు మహ్మద్ అమ్జద్ పాషా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైనారిటీల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ, పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.











