రుద్రంపూర్ రామాలయంలో వైభవంగా శ్రీరామనవమి
భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్ కేస్లీ
ప్రజా గొంతుక న్యూస్ మార్చి 27/ చుంచుపల్లి (రుద్రంపూర్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
భక్తుల సేవలో సర్పంచ్ బృందం
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పూజా కార్యక్రమాలకు మరియు కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం రుద్రంపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం సేవా కార్యక్రమాలను చేపట్టింది. రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ మరియు ఉప సర్పంచ్ తోట రాజు ఆధ్వర్యంలో రామాలయ కళ్యాణ మండపంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ కేస్లీ మాట్లాడుతూ.. శ్రీరామచంద్రుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున భక్తులకు ఉపశమనం కలిగించేందుకు ఈ చిన్న ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు, సిబ్బంది మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.మజ్జిగ పంపిణీ చేసిన పంచాయతీ పాలకవర్గం చొరవను భక్తులు అభినందించారు.











