మృతుడికి 40 లక్షల బీమా పాలసీ చెల్లింపు

ప్రజా గొంతుక మే 6,ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన చందుపట్ల విద్యాసాగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతను తీసుకున్న బీమా పాలసీ ఆధారంగా కుటుంబానికి రూ.40 లక్షల భీమా చెక్కును ఎస్బిఐ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం షేక్ మరియు అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం షేక్ మాట్లాడుతూ కుటుంబ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బీమా తీసుకోవాలని సూచించారు. సంవత్సరానికి రూ.3,000తో రూ.60 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు విద్యుత్ షాక్ వరదలు పాముకాటు వంటి ప్రమాదాలకు ఈ బీమా వర్తిస్తుందని వివరించారు.
ప్రమాదవశాత్తు మరణం మాత్రమే కాకుండా పూర్తి పాక్షిక వైకల్యాలు అవయవ నష్టం అంబులెన్స్ ఖర్చులు పిల్లల విద్యా సహాయం వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. వైకల్యానికి అనుగుణంగా 25 నుంచి 100 శాతం వరకు పరిహారం అందుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సౌమ్య రవికుమార్ అంబాల సుమన్ కార్తీక్ పాల్గొన్నారు.











