కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట..
మహిళ సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ
బచ్చన్నపేట, జూన్ 26 (దిశ పవర్):గ్రామీణ మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు అన్నారు. గ్రామంలోని మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించనున్న భవనానికి శుక్రవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అల్వాల నర్సింగరావు మాట్లాడుతూ, భవనం నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాల నిర్వహణకు శాశ్వత వేదిక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వావలంబన కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు.గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైరి రజిత, వార్డు సభ్యులు ముద్దసాని నవ్య, కక్కెర్ల విజయ, గందమల్ల మాధవి , దిడిగె చంద్రమ్మ, కక్కెర్ల ఉమారాణి, ప్రశాంత్‌తో పాటు మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.











