నాలుగు జిల్లాల కూడలిలో ‘విశ్రాంతి’ కరువు
బచ్చన్నపేట చౌరస్తాలో శిథిలావస్థకు చేరిన ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం
ఆధునిక వసతులతో త్వరలో పునర్నిర్మాణం: సర్పంచ్ అల్వాల నర్సింగరావు
దిశ పవర్ బచ్చన్నపేట, ఆగస్టు 23:
ఒకప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిన బచ్చన్నపేట చౌరస్తాలోని పురాతన ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం నేడు నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరింది. భవనం చుట్టూ అపరిశుభ్రత నెలకొనడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొన్ని దశాబ్దాల క్రితం బచ్చన్నపేట నడిబొడ్డున నిర్మించిన ఈ గెస్ట్‌హౌస్ ప్రస్తుతం సంరక్షణ లేక పూర్తిగా కూలిపోయే దశకు చేరుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారు భవన పరిసరాలను మలమూత్ర విసర్జనకు వినియోగిస్తుండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. రాత్రివేళల్లో నిర్మానుష్యంగా మారుతున్న ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు, తాగుబోతులకు అడ్డాగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాడు ప్రజల ముంగిటకే పాలన
బచ్చన్నపేట మండలం నాలుగు జిల్లాల కూడలిగా ఉండటంతో గతంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించినప్పుడు ఈ విశ్రాంతి భవనంలోనే బస చేసేవారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అర్జీలు సమర్పించేవారు. ప్రజలకు, పాలనకు మధ్య వారధిగా నిలిచిన ఈ చారిత్రక భవనం నేడు శిథిలావస్థకు చేరడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్వవైభవం తీసుకొస్తాం
విశ్రాంతి భవనం దుస్థితిని తొలగించి బచ్చన్నపేట చౌరస్తాకు కొత్త కళ తీసుకొస్తామని సర్పంచ్ అల్వాల నర్సింగరావు తెలిపారు. భవనాన్ని అన్ని ఆధునిక వసతులతో త్వరలోనే పునర్నిర్మిస్తామని చెప్పారు. మంత్రులు, అధికారులు వచ్చినప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.
– దిశా పవర్, బచ్చన్నపేట











