బానిస సంకెళ్లు తెంచిన రోకలిపోటు..
దొరల గడీలను గజగజలాడించిన ఆత్మగౌరవ ప్రతీక
వెట్టిచాకిరీపై తిరగబడిన తొలి విప్లవ కేతనం
కేసిరెడ్డిపల్లిలో కొలువుదీరనున్న వీరనారి ‘చాకలి ఐలమ్మ’!
కేసిరెడ్డిపల్లిలో విగ్రహ ఆవిష్కరణ లొ పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
దిశపవర్,బచ్చన్నపేట:
ఆమె చేతిలో అత్యాధునిక తుపాకులు లేవు.. కోటలు పేల్చే ఫిరంగులు లేవు. ఉన్నదల్లా శ్రమజీవి ఆయుధమైన రోకలి బండ, గుండెల నిండా దొరల అన్యాయాన్ని ఎదిరించే అపరిమితమైన ధైర్యం! నాడు నిజాం నిరంకుశత్వానికి, విస్నూర్ దేశ్ముఖ్ రాక్షసత్వానికి ఎదురొడ్డి నిలిచి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అట్టడుగు వర్గాల గుండెల్లో విప్లవ శంఖం పూరించిన వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ. శ్రమదోపిడీ, వెట్టిచాకిరీలకు వ్యతిరేకంగా సాగిన తొలి భూపోరాట యోధురాలి వీరత్వాన్ని స్మరించుకుంటూ.. బచ్చన్నపేట మండలoలోని కేసిరెడ్డిపల్లి గ్రామంలో ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
గుండెల్ని ఉప్పొంగించిన ఐలమ్మ పోరాటం
నాడు దొరలు, భూస్వాములు పేదల రక్తాన్ని తాగుతూ, బట్టలు ఉతికే రజకులతో ఉచితంగా పనులు (వెట్టిచాకిరి) చేయించుకునే రోజుల్లో ఐలమ్మ “మా శ్రమ మాదే.. మా భూమి మాదే” అని గర్జించింది. తాను కష్టపడి పండించిన పంటను అక్రమంగా గుంజుకోవాలని చూసిన జమీందార్ రామచంద్రారెడ్డి సైన్యాన్ని, తనకున్న ఒకే ఒక్క ఆయుధం ‘రోకలి’తో సింహంలా ఎదిరించింది. తన ఇల్లు కాలిపోయినా, కన్నబిడ్డలు చిత్రహింసలకు గురైనా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. కూలీలుగా బతికే అణగారిన వర్గాలను ఏకం చేసి, పారలు, గొడ్డళ్లు పట్టించి దొరల గడీల పునాదులను కదిలించింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరే రవికుమార్, ఉప సర్పంచ్ చింతల రాజు, నిర్వాహకులు రిటైర్డ్ టీచర్ మామిడాల ప్రభాకర్, సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు మల్లవరం వెంకటేశ్వరరెడ్డి, సిద్దుల గుట్ట చైర్మన్ ఈదులకంటి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బల్నే రాజేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు పైసా రాజశేఖర్, గ్రామ శాఖ బిఆర్ఎస్ అధ్యక్షులు హరిప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, బాల్ రాజు గౌడ్, గాలి తిరుపతి, చెన్నయ్య, ఇమ్మడి సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.











