విజిబుల్ పోలీసింగ్ బలోపేతం – రాత్రి గస్తీ పెంచాలని డీసీపీ రాజేష్ సూచనలు

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 09:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లోని శంషాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి)బి.రాజేష్ ఈరోజు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు.ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతలు మరియు పోలీస్ స్టేషన్ పనితీరును సమగ్రంగా సమీక్షించారు.స్టేషన్‌లో నమోదైన ఆస్తి నేరాలు,తీవ్రమైన నేరాలు (ఘోర నేరాలు) మరియు పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులను పరిశీలించి,దర్యాప్తు పురోగతిపై అధికారులతో చర్చించారు.ముఖ్యమైన కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని,సాక్ష్యాధారాల సేకరణలో నాణ్యతను మెరుగుపరచాలని దర్యాప్తు అధికారులకు ఆదేశించారు.రౌడీ షీటర్లు,సస్పెక్ట్ షీటర్లు మరియు పాత నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెట్రోలింగ్ వాహనాల పనితీరు,డయల్-100 కాల్స్‌కు వేగవంతమైన స్పందన,నైట్ పెట్రోలింగ్ మరియు బీట్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.సున్నిత ప్రాంతాల్లో పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజా స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ,ప్రజల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందించాలని,బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు.విధుల నిర్వహణలో క్రమశిక్షణ,జవాబుదారీతనం పాటించాలని అధికారులకు సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ బి.లక్ష్మీ నారాయణ రెడ్డి,సబ్ ఇన్‌స్పెక్టర్లు దయాకర్ రెడ్డి,లక్ష్మయ్య, ఫైసల్ అహ్మద్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నరు.











