పూలే – అంబేడ్కర్ జన జాతరను జయప్రదం చేయండి
కొండేటి శ్రీను, కేవిపిఎస్ జిల్లా అధ్యక్షులు పిలుపు……
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:10
ఏప్రిల్ మాసంలో మహానీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 19న నిర్వహించనున్న పూలే – అంబేడ్కర్ జన జాతరను జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను పిలుపునిచ్చారు.
ఈ రోజు స్థానిక సుందరయ్య భవనంలో పూలే–అంబేడ్కర్ జన జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానీయుల ఆశయ సాధన కోసం కేవిపిఎస్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
కుల వివక్ష, అంటరానితనం నిర్మూలించి, మనుషులంతా సమానమనే భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కులం, మతం ఆధారంగా సమాజాన్ని విభజించడం సరికాదని స్పష్టం చేశారు.
స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్న నేటికి దళితులపైన హత్యలు, అత్యాచారాలు సాంఘిక బహిష్కరణలు దాడులు కొనసాగుతున్నాయని,దళితవాడలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని,దళిత కాలనీలలో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,రాష్ట్ర ప్రభుత్వం దళితులకు కేటాయించిన బడ్జెట్ ను దళితుల అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టకుండా దళితులకు అవసరం లేనటువంటి రంగాలకు ఖర్చు పెడుతున్నారని అన్నారు
దళితుల సమగ్ర అభివృద్ధి కోసం కేవిపిఎస్ అనేక ఉద్యమాలు నిర్వహించిందని, జస్టిస్ పున్నయ్య కమిషన్, ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు, స్మశానవాటికల భూముల కేటాయింపు వంటి అంశాలలో విజయాలు సాధించిందని తెలిపారు.ఇంకా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన
దళిత నిరుద్యోగుల కోసం ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలి
ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలి
దాడుల బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం వెంటనే చెల్లించాలి
సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ బిల్లులను ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలి
హాస్టల్లకు పక్కా భవనాలు నిర్మించాలి
ఈ సమస్యల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.
పూలే–అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం ఏప్రిల్ 19న నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఉదయం 11 గంటలకు ఆట–పాట–మాట కార్యక్రమాలతో జన జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దైద శ్రీను,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కారంపూడి ధనమ్మ, కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు దొంతల నాగార్జున, దొరేపల్లి మల్లయ్య, మేకల వెంకన్న, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కోరే రమేష్, కెవిపిఎస్ మండల అధ్యక్షులు కొమ్ము జీవన్, వర్షిత్, పొదిల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.











