భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు:
న్యాయం చేయాలని సౌమ్య డిమాండ్
ప్రజా గొంతుక,బచ్చన్నపేట :
తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ భార్య తన భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన ఘటన బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రాజపేట మండలం జాల గ్రామానికి చెందిన సౌమ్యకు, నాగిరెడ్డిపల్లికి చెందిన శివతో 2021లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 2.50 లక్షల నగదు, 6 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఏడాది పాటు సజావుగానే సాగిన వీరి సంసారంలో ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి.గత నాలుగేళ్లుగా భర్త తనను ఇంటికి తీసుకెళ్లకుండా వేధిస్తున్నాడని, భర్తతో పాటు బావ కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సౌమ్య ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. “నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు” అని ఆమె స్పష్టం చేశారు. బాధితురాలికి మద్దతుగా జాల మరియు నాగిరెడ్డిపల్లి గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. అధికారులు స్పందించి తనను భర్తతో కలిపి ఉంచాలని ఆమె కోరుతున్నారు.











