రిజర్వేషన్లు లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్లమో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ప్రజా గొంతుక మార్చి 12 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
*అంబేద్కర్ విగ్రహావిష్కరణ*
రఘునాథపల్లి మండలం బాంజీపేటలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతికి రెండు రోజుల ముందే విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు.అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఉన్న వ్యక్తి, అత్యధిక మంది ఆరాధించే వ్యక్తి అంబేద్కర్ ఒక్కరేనని కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వంగా దేశ ప్రజలు కలిసి జీవిస్తున్నారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనేనని స్పష్టం చేశారు.
*కేంద్రంపై విమర్శలు*
కొంతమంది పాలకులు రాజ్యాంగాన్ని మార్చేయాలని, రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వాలు గత్యంతరం లేకనే రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయన్నారు. రిజర్వేషన్లు ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
*సుప్రీం తీర్పుపై అసంతృప్తి*
దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదని, దానిని పునర్ సమీక్షించుకోవాలని కోరారు. కులం పుట్టుకతో వస్తుందని, మతం మధ్యలో వస్తుందని.. క్రిస్టియన్గా మారినంత మాత్రాన దళితుల జీవితాలు మారలేదని వ్యాఖ్యానించారు. కుల వ్యవస్థ, అంటరానితనం ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు.
*చదువు ఒక్కటే మార్గం*
అంబేద్కర్ చూపిన మార్గం చదువేనని, అన్ని సమస్యలకు పరిష్కారం చదువుతోనేనని తెలిపారు. చదువు ఆత్మవిశ్వాసాన్ని, సంస్కారాన్ని ఇస్తుందని, పోటీ ప్రపంచంలో నిలబడి ఉన్నత స్థాయికి ఎదిగేలా చదవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు కాదు, నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే చదువు, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లే కారణమని గుర్తుచేశారు.
*హామీలు*
బాంజీపేట రైతులకు సాగు నీరు అందేలా కల్వకు షేటర్లు ఏర్పాటు చేయిస్తానని, అంబేద్కర్ విగ్రహం వరకు సిసి రోడ్డు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోడ్డుకు ‘అంబేద్కర్ మార్గ్’గా నామకరణం చేయాలని గ్రామస్తులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, సర్పంచ్ గైని శ్రీనివాస్, విగ్రహ కమిటీ సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.











