వల్భాపూర్ ఎస్ఆర్ కాలేజీ ఎదుట డివైడర్ తొలగించాలని గ్రామస్తుల విజ్ఞప్తి
సర్వీస్ రోడ్డుకు మార్గం లేక ప్రయాణికులకు ఇబ్బందులు
ప్రజా గొంతుక,ఎల్కతుర్తి మే 15 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్లోని ఎస్ఆర్ కాలేజీ ముందు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన డివైడర్ కారణంగా సర్వీస్ రోడ్డుకు వెళ్లేందుకు మార్గం లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.సూరారం, దండేపల్లి, వీరనారాయణపురం, వల్భాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణాలు సాగిస్తుండగా, డివైడర్ ఏర్పాటు వల్ల దూరంగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో సమయం వృథా కావడంతో పాటు ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని తెలిపారు.ప్రత్యేకించి విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో మరియు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ల రాకపోకలకు కూడా ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఎస్ఆర్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేసిన డివైడర్‌ను తొలగించి, సర్వీస్ రోడ్డుకు సౌకర్యవంతమైన మార్గం కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. డివైడర్ తొలగిస్తే సూరారం, దండేపల్లి, వీరనారాయణపురం, వల్భాపూర్ గ్రామాల ప్రజలకు ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.











