ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ వేడుకలు. ఈద్గాలు,మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ప్రజా గొంతుక న్యూస్/రామగుండం/రిపోర్టర్ నూక రాందాసు
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.త్యాగం, కరుణ,శాంతికి ప్రతీకగా నిలిచే బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈద్గాలు,మసీదుల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రార్థనల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈద్గాల వద్ద ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,బక్రీద్ పండుగ త్యాగానికి, ప్రేమకు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. ప్రజలంతా పరస్పరం మతాలను గౌరవించుకుంటూ సోదరభావంతో పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.పండుగ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈద్గాలు, మసీదులు,ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.సోషల్ మీడియాలో వచ్చే వదంతులు,అసత్య ప్రచారాలను నమ్మవద్దని సీపీ సూచించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్థానిక పోలీసులను లేదా డయల్-100ను సంప్రదించాలని పోలీస్ కమిషనర్ కోరారు.











