నాన్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
స్టేషన్ ఘన్‌పూర్/ జఫర్గడ్, జూన్ 10, (దిశ పవర్ న్యూస్) :
నిరుపేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుదవారం జఫర్గడ్ మండలం దుర్గ్య తండా సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ పాఠశాల పరిసరాలకు ఆనుకొని ఉన్న స్థానిక దుర్గ్య తండా పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక స్థలాన్ని పాఠశాలకే కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రకృతి వనం, స్మశాన వాటిక ఏర్పాటుకు మరొక చోట గుర్తించిన ఎకరం స్థలాన్ని వెంటనే గ్రామ పంచాయితీకి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మన ప్రాంత అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఒక్కో నియోజకవర్గంలో 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో 4గురుకులాలు 2600మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు. అత్యాధునిక అకాడమిక్ బ్లాక్, ల్యాబ్, హాస్టల్స్, ఉపాధ్యాయుల వసతి గృహాలు, క్రీడా మైదానాలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పనుల పురోగతిపై నెలకు ఒకసారి పనుల ప్రోగ్రెస్ ను తయారు చేయాలని సూచించారు. మే 2027 వరకు పాఠశాల నిర్మాణ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ కు స్పష్టం చేశారు. ఈ ఇంటిగ్రెటెడ్ పాఠశాలను బాలికలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. బాలికల భద్రతతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఏడాదిలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు కానుకగా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ అధికారులు, ఆర్డీవో, తహసీల్దార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











