దిశ పవర్ బచ్చన్నపేట మండలం :త్వరిత న్యాయ పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక ఉత్తమ వేదిక అని బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన, సులభంగా పరిష్కరించేందుకు తెలంగాణ వ్యాప్తంగా జూన్ 20వ తేదీన నిర్వహించబోయే రెండవ జాతీయ లోక్ అదాలత్‌ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ.. కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో, రాజీ మార్గం ద్వారా తక్కువ సమయంలోనే ఇక్కడ పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల ప్రజలకు సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయన్నారు. చట్టపరమైన చిక్కులు లేకుండా, ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యలు ముగుస్తాయని చెప్పారు. కాబట్టి బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇరుపక్షాల సమ్మతి గల కేసుల దారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కేసులను రాజీ చేసుకోవాలని ఎస్సై శ్రీకాంత్ సూచించారు.











