దిశ పవర్ బచ్చన్నపేట.బచ్చన్నపేట మండల కేంద్రంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, వినియోగదారులకు నాణ్యమైన చేపల విక్రయ సౌకర్యం కల్పించే లక్ష్యంతో లైవ్ ఫిష్ మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు, గోపాల్‌నగర్ సర్పంచ్ పేరబోయిన కళ్యాణి–పరుశురాములు, మత్స్య సంఘం ప్రతినిధులు, మత్స్య శాఖ అధ్యక్షులు వద్ధి వెంకటయ్య పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు కోసం సంఘ సభ్యులు ఐక్యంగా ముందుకు వచ్చి నిధులను సమీకరించి లైవ్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ మార్కెట్ ద్వారా స్థానికంగా తాజా చేపలు అందుబాటులోకి రావడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం తగ్గి మత్స్యకారులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.అదేవిధంగా మార్కెట్ పరిసరాల్లో దుకాణాల ఏర్పాటుతో యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని, భవిష్యత్తులో ఈ మార్కెట్ బచ్చన్నపేట మండలానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మత్స్య సంఘం నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.











