యువతకు స్వయం ఉపాధి
మత్స్యకారుల ఉపాధికే ప్రాధాన్యం..
బచ్చన్నపేటలో లైవ్ ఫిష్ మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ
దిశపవర్,బచ్చన్నపేట:బచ్చన్నపేట మండల కేంద్రంలో లైవ్ ఫిష్ మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, వినియోగదారులకు నాణ్యమైన, తాజా చేపలను అందించడమే లక్ష్యంగా ఈ మార్కెట్‌ను10 లక్షల వ్యయంతో, 8 షటర్లు ను ఏర్పాటు చేస్తున్నారు. బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు, గోపాల్‌నగర్ సర్పంచ్ పేరబోయిన కళ్యాణి–పరుశురాములు దంపతులు, మత్స్య శాఖ అధ్యక్షులు వుద్ది వెంకటయ్య మత్స్య సంఘం ప్రతినిధులు,ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు కోసం సంఘ సభ్యులంతా ఐక్యంగా ముందుకు వచ్చి, నిధులు సమీకరించి ఈ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ లైవ్ ఫిష్ మార్కెట్ ద్వారా స్థానికులకు తాజా చేపలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అంతేకాకుండా మధ్యవర్తుల ప్రమేయం తగ్గి మత్స్యకారులకు నేరుగా గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ పరిసరాల్లో దుకాణాల ఏర్పాటుతో స్థానిక యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో ఈ మార్కెట్ బచ్చన్నపేట మండలానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భైరవుని రజిత వెంకటేశం, మత్స్య సంఘం ప్రతినిధులు, సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











