బచ్చన్నపేట ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ సేవలు ప్రారంభం
దిశ పవర్ బచ్చన్నపేట, జూలై 2: బచ్చన్నపేట ప్రభుత్వాసుపత్రిలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మార్చురీ (మృతదేహాల భద్రపరిచే గది) సేవలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీసీహెచ్ఎస్) నరేందర్ ప్రారంభించారు. ఈ సేవలు అందుబాటులోకి రావడంతో బచ్చన్నపేట మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగింది.ఇప్పటి వరకు మృతదేహాలను భద్రపరచేందుకు ఇతర ప్రాంతాల ఆసుపత్రులకు తరలించాల్సి రావడంతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మార్చురీ ప్రారంభంతో ప్రమాదాలు, అనారోగ్యం లేదా ఇతర కారణాలతో మృతి చెందిన వారి మృతదేహాలను అవసరమైన సమయం వరకు భద్రపరిచే సౌకర్యం స్థానికంగానే అందుబాటులోకి వచ్చింది. దీంతో వైద్య సేవలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సకాలంలో సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయి.ఈ సందర్భంగా డీసీహెచ్ఎస్ నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గీతారాణి, బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సృజన, డాక్టర్ దీప్తి, డాక్టర్ స్వప్న, డాక్టర్ ప్రసన్న, సర్పంచ్ అల్వాల నర్సింగరావు, ఉపసర్పంచ్ బైరి రజిత, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు పలువురు స్థానికులు పాల్గొన్నారు.











