కొడవటూర్ సిద్ధేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పిన్నింటి కావ్య బాపురెడ్డి
బచ్చన్నపేట, జూలై 13 (దిశ పవర్):
బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికిముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి కావ్య బాపురెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, కొడవటూర్ శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని అన్నారు. ఆలయాల సమగ్ర అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక వైభవానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని, రానున్న రోజుల్లో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి కావ్య బాపురెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలా కవిత మురళి, ప్రధాన అర్చకులు ఓం నమః శివాయ, ఆలయ డైరెక్టర్లు చిక్కుడు మల్లేశం, రాజేష్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.











