జయముఖి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ‘సి.పి.ఆర్’ పై అవగాహన సదస్సు .
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 09 ఏప్రిల్ 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పరిధిలో గల
జయముఖి ఫార్మసీ కళాశాల *ఎన్ ఎస్ ఎస్* యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా నేడు శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ (డాక్టర్ రమాక శ్రీనివాస్) సౌజన్యంతో సి.పి.ఆర్ పై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అకస్మాత్తుగా హృదయ స్తంభన (కార్డియాక్ అరెస్ట్ ) కు గురైన వ్యక్తిని ప్రాథమిక చికిత్స ద్వారా ఎలా కాపాడవచ్చు అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సయ్యదా నిషాత్ ఫాతిమా మాట్లాడుతూ, సి.పి.ఆర్ ప్రక్రియలో వచ్చిన నూతన మార్గదర్శకాల గురించి విద్యార్థులకు , ప్రజలకు వివరించారు. హృదయ స్తంభన జరిగిన మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమని, ఆ సమయంలో సరైన పద్ధతిలో సి.పి.ఆర్ అందించడం వల్ల ప్రాణాలు నిలబెట్టవచ్చని తెలిపారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. అనూష మాట్లాడుతూ, సి.పి.ఆర్ గురించి తెలుసుకోవడం ప్రతి వ్యక్తికి ముఖ్యమని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి ఈ ప్రక్రియపై అవగాహన ఉంటే, కేవలం ఒక ప్రాణాన్ని మాత్రమే కాకుండా, ఆ వ్యక్తిపై ఆధారపడి ఉన్న ఒక పూర్తి కుటుంబాన్నే కాపాడవచ్చని ఆమె వెల్లడించారు.
కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు అభిచంద్ర, మధునిత, మరియు అంక్షిత అత్యంత ఉత్సాహంగా గ్రామస్తులకు సి.పి.ఆర్ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపారు. హృదయ స్తంభన ఏర్పడినప్పుడు అత్యవసరంగా ఎలా స్పందించాలో వారు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు గ్రామస్తులందరికీ అవగాహన కల్పించారు. సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల గ్రామస్తులు మరియు కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.











