*ఉపాధి కూలీలకు సర్పంచ్ భరోసా మజ్జిగ ఓఆర్ఎస్ పంపిణీ*
ప్రజా గొంతుక ఏప్రిల్ 28 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
వేలేరు మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి మంగళవారం పరిశీలించారు. పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా తలకు టోపీలు, టవళ్లు ధరించాలని తరచూ నీరు తాగాలని మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను స్వయంగా పంపిణీ చేశారు.ఉపాధి హామీ కూలీల డబ్బులు త్వరలోనే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని భరోసా ఇచ్చారు. వేసవికాలంలో కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు..











