ఎడ్లబండి! యాదిలో…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:27
ఘలఘల గంటల సవ్వడితో,పొద్దుగాల ఆరు కొట్టకముందే.. పొలాల గట్లపై బాటలు వేస్తూ, పల్లె పచ్చదనంలో నా చక్రాల అచ్చులు గీస్తూ, నీ ‘సోపతై’ సాగిపోతినే!
నువ్వు కాడికట్టి నన్ను తోలుకుపోతుంటే, ఎగుడు దిగుడు మట్టి రోడ్డుపై… నా ఇరుసు ‘కిర్రు కిర్రు’ సప్పుడుకు, బాటపొంటి పోరలంతా సంబురంగా, నాపై ఎక్కి కూర్చుందురే.!
నన్ను, నా జోడెడ్ల సోపతిని తోబుట్టువులా సాకినవే, నీ ఇంట్ల ఆడిబిడ్డ పెళ్ళికి నన్నే ‘పెళ్ళి పెద్దను’ జేస్తివి.ఉగాది పండుక్కు, జాతరకు పయనమైతే, ఆ మూడు రోజుల జాతర్ల… నేనే నీకు గుడారమైతినే!
ఆనాడు పిడుగుపడి మన లేగె సచ్చిపోతే, కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లి వలే.నువ్వు గుక్కపెట్టి ఏడుస్తుంటే, నా గుండె ఎంత భారంగా ఉన్నా… నేనే పాడెనై, ఆ పసి లేగెను కన్నీళ్లతో మోస్తిని గదా!
నీ జ్ఞపకాలన్ని ఈనాటికి నా మనస్సుల మెదుల్తనే ఉన్నయిఈనాడు ట్రాక్టర్ల మోజులో పడి,నా కాడిని విరిచేసి.నా నొగను నేలపాలు జేస్తివి!
గ్రీజు చుక్క లేక నా ఇరుసు ఈనాడు మూగబోయింది..
కష్టకాలంలో తోడున్న ఈ పాత నేస్తం యాదికొస్తలేదా?
నువ్వు వాడే ఆ ఇనుప మిషన్లకు జీవం లేదు, నా ప్రతి చెక్క ముక్క నీ తాత ముత్తాతల ఆస్తి రూపాయి ఖర్చు లేకుండా నీ ఇల్లు నింపిన నన్ను…
ఈనాడు అనాథను జేస్తివి గదే! ఎందుకే రైతన్న నీకు-ఈ ఒంటెద్దు పోకడ? !











