ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా.
ప్రజా గొంతుక న్యూస్/రామగుండం/రిపోర్టర్ నూక రాందాసు
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు,వారెంట్ల అమలు,పోలీస్ సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు.ఇప్పటివరకు నమోదైన కేసులు,పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై సీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సీపీ మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న కేసుల దర్యాప్తులో ఎలాంటి రాజీ పడకుండా పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.2025 సంవత్సరానికి ముందు నమోదై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ,అరెస్టులు, సాక్ష్యాల సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ప్రాపర్టీ,బాడిలీ అఫెన్స్ కేసుల దర్యాప్తును పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని తెలిపారు.గ్రేవ్ కేసుల పురోగతిని డీసీపీలు, అదనపు డీసీపీలు వారానికి ఒకసారి సమీక్షించాలని ఆదేశించారు.
ఆర్థిక నేరాల కేసుల్లో చట్టప్రకారం నిందితులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. కిడ్నాపింగ్,మిస్సింగ్ కేసుల్లో బాధితులను గుర్తించడంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని,అలాంటి కేసుల్లో ఆలస్యం ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను గౌరవ న్యాయస్థానం అనుమతితో త్వరితగతిన నిర్వీర్యం చేయాలని సూచించారు.సైబర్ క్రైమ్,ఎన్డీపీఎస్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులు ఉన్నట్లయితే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, కన్విక్షన్ శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాల్లో భాగంగా అక్రమ ఇసుక రవాణా, గుడుంబా తయారీ, పేకాట తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి,వారి ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, ప్రజల నుంచి నేరుగా అందే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.సీపీ కార్యాలయం ద్వారా వచ్చే ఫిర్యాదులపై కూడా వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులను సహించేది లేదని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది విధిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించాలని, విధి నిర్వహణలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. కార్యాలయాలు,విధి నిర్వహణ ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా ఎవరికీ అనుమతి ఇవ్వవద్దని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్,పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్,జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,సీఐలు, ఇన్స్పెక్టర్లు,ఎస్ఐలు పాల్గొన్నారు.











