దిశ పవర్ బచ్చన్నపేట మండలం తాము నాటిన మొక్కలు మహావృక్షాలుగా మారడమే కాకుండా, వాటికి ఏకంగా జిల్లా కలెక్టర్ పేరు పెట్టడంపై స్థానిక యువకుడు గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు.బచ్చన్నపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి ప్రాంగణంలో గత పది సంవత్సరాల క్రితం గోవర్ధన్ తన పుట్టినరోజును పురస్కరించుకుని వేప, రావి మొక్కలను నాటారు. కాలక్రమేణా ఆ మొక్కలు నేడు పచ్చని వృక్షాలుగా రూపాంతరం చెందాయి. భక్తులకు, బాటసారులకు నీడనిస్తూ పర్యావరణానికి ప్రతీకగా నిలిచాయి.ఈ నేపథ్యంలో, నాటిన ఆ వృక్షాలకు గౌరవ సూచకంగా జిల్లా కలెక్టర్ పేరును నామకరణం చేయడం విశేషం. దీనిపై గోవర్ధన్ మాట్లాడుతూ… పదేళ్ల క్రితం నాటిన మొక్కలు నేడు పెద్ద వృక్షాలుగా మారడం, వాటికి బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు కలెక్టర్ గారి పేరు పెట్టడం తనకు జీవితంలో మర్చిపోలేని సంతోషాన్ని, ఎనలేని తృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు.











