స్టేషన్ ఘన్‌పూర్, జూన్ 19, (దిశ పవర్): స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో ఎలాంటి సీబీఎస్ఈ పాఠశాలలు లేవనే విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ట్రస్మా డివిజన్ కమిటీ అధ్యక్షులు ఉబ్బని మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు సంజీవ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు కేసి జాన్ బన్నీ అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో రెండు మూడు పాఠశాలల్లో సీబీఎస్ఈ అనుమతులు లేకుండా ఉన్నట్లు ప్రచారం చేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పాఠశాలలు అడ్మిషన్ల కోసం సీబీఎస్ఈ, ఇద్దరు ఉంటే ఒకరు ఉచితం, యూనిఫారాలు, బస్సు సౌకర్యం, పుస్తకాలు ఉచితం అంటూ చేస్తున్న ప్రచారాలను తల్లిదండ్రులు నమ్మవద్దుని కోరారు. ప్రవేశ సమయంలో ఎనిమిది వేలతో ప్రవేశం పొందండి 10వ తరగతి వరకు కూడా అదే ఫీజు తీసుకుంటామని సాధ్యం కానీ హామీలు ఇవ్వడం సరికాదన్నారు. గతంలో అక్షర పాఠశాల యాజమాన్యం ఇలాంటి ప్రకటనలు, హామీలు ఇచ్చి విద్యార్థులను పాఠశాల చేర్పించుకుని ఫీజులు వసూలు చేసుకున్న రెండు నెలలకే బోర్డు తిప్పేసి పారిపోయిన విషయాన్ని వారు గుర్తు చేశారు. సమావేశంలో డివిజన్ కమిటీ కోశాధికారి జార్జ్ బెన్నీ, సభ్యులు శ్రీనివాస్, జోసెఫ్, సతీష్ రెడ్డి, బంటి, కిరణ్ కుమార్, సరళ అరుణాచలం, రాజు, కవితా రాణి తదితరులు పాల్గొన్నారు.











