దిశ పవర్ బచ్చన్నపేట మండలం, చిన్నరామచర్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి కడకంచి బాలమణి శ్రీనివాస్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, ప్రజాస్వామ్య విలువల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు.అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతూ సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలు, నిర్వాహకులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.











