ఎస్సీ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా:
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా
ఎస్సీలను ఏకతాటిపైకి తీసుకువస్తా:
ఇందిరమ్మ స్ఫూర్తితో ఎస్సీల అభివృద్ధికి కృషి
దిశ పవర్ బచ్చన్నపేట మండలం: బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పాకాల చిరంజీవిని నియమించారు. ఈ మేరకు మానకొండూరు ఎమ్మెల్యే , టిపిసిసి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ వేముల మల్లేష్ నియామక పత్రాన్ని చిరంజీవికి అందజేశారు. మండలంలో ఎస్సీ వర్గాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని వేముల మల్లేష్ కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా నూతన మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాకాల చిరంజీవి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ వేముల మల్లేష్,డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి లక్ష్మీనారాయణ, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మసూద్,జయ మల్లేశం,జిల్లా సందీప్,నాగపురి కిరణ్, అల్వాల రమేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నాడు ఇందిరమ్మ ఎస్సీ వర్గాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి వారి సంక్షేమానికి కృషి చేశారని చిరంజీవి గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. మండలంలోని ఎస్సీ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నాయకులతో కలిసి పనిచేస్తానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పాకాల చిరంజీవి పేర్కొన్నారు. ఆనాడు ఇందిరమ్మ భూమి లేని నిరుపేద ఎస్సీ కుటుంబాలకు వ్యవసాయ భూములను పంచడం. నివాసం లేని దళితులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం. సమాజంలో శతాబ్దాలుగా ఉన్న వెట్టిచాకిరి విధానాన్ని చట్టం ద్వారా రద్దు చేసి, బాధితులకు పునరావాసం కల్పించడం వంటి సేవలు అందించారని, మండలంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తానని అన్నారు.











