అదనపు కట్నం వేధింపులు

వివాహిత ఆత్మహత్యాయత్నం
ప్రజా గొంతుక న్యూస్ ఏప్రిల్ 3 /భద్రాద్రి కొత్తగూడెం (చుంచుపల్లి): అదనపు కట్నం కోసం భర్త చేస్తున్న వేధింపులు తాళలేక ఓ వివాహిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. బాధితురాలి తండ్రి ఎస్.కె. సోనీ సాహెబ్ తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంపూర్కు చెందిన ఆయన కుమార్తె ఫైజా బేగంకు, రామాంజనేయ కాలనీకి చెందిన ఎం.డి యాకుబ్ పాషాతో 2017లో వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చినప్పటికీ, అల్లుడు యాకుబ్ పాషా అదనపు కట్నం కోసం నిరంతరం వేధిస్తూనే ఉన్నాడు. గతంలో కేసు నమోదైనప్పటికీ, పద్ధతి మార్చుకుంటానని నమ్మించి రాజీ పడి భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. కేసు విత్ డ్రా చేయించుకున్న కొద్ది రోజులకే తన మామకు రిటైర్మెంట్ ద్వారా వచ్చిన రూ. 17 లక్షల నగదుతో పాటు, ఇల్లు రాసివ్వాలని మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు.
భర్త వేధింపులు, మరో మహిళతో అక్రమ సంబంధం గురించి ప్రశ్నించినందుకు చంపేస్తానని బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫైజా బేగం ఏప్రిల్ 2026 సాయంత్రం ఇంట్లోనే నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తన కూతురి ప్రాణాల మీదకు తెచ్చిన యాకుబ్ పాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని తండ్రి పోలీసులను కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











