మేడ్చల్ గడ్డపై నూతన రాజకీయ శకం.. కందుకూరులో కదం తొక్కిన ‘పోరు గర్జన’ బైక్ ర్యాలీ!
*కవితక్క ప్రకటించబోయే నూతన పార్టీకి జన నీరాజనం.*
*ప్రశ్నించు.. పోరాడు.. పరిష్కరించు అనే నినాదమే ఊపిరిగా ముందుకు..*
*ఏప్రిల్ 25న మేడ్చల్ ఆవిర్భావ సభకు తరలిరావాలని కప్పాటి పాండురంగా రెడ్డి పిలుపు.*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 12:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో కప్పటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ ఆడబిడ్డ, ఉద్యమ కెరటం, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క ఈనెల 25వ తేదీన మేడ్చల్ వేదికగా ప్రకటించబోయే నూతన రాజకీయ ప్రస్థానానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఈ క్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల కేంద్రంలో ఆదివారం నాడు తెలంగాణ జాగృతి ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయకంటి జగన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ‘పోరు గర్జన’ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అర్చన సేనాధిపతి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, మేడ్చల్ జిల్లా నాయకులు రామిడి వెంకట్ రెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి, కె. శివశంకర్ తదితరులు జెండా ఊపి ఈ భారీ ర్యాలీని ప్రారంభించారు. మోటార్ సైకిళ్లతో వివిద గ్రామాల నుండి తరలి వచ్చిన కార్యకర్తలు కందుకూరు మండల కేంద్రం మరియు గామంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ:”తెలంగాణ సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో కవితక్క పాత్ర చిరస్మరణీయం. తెలంగాణ జాగృతి ద్వారా గత 20 ఏళ్లుగా సంస్కృతిని, ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఆమె, నేడు అన్ని వర్గాల సాధికారత కోసం మరో పోరాటానికి సిద్ధమయ్యారు. సామాజిక సమానత్వం, సర్వోదయ తెలంగాణే ధ్యేయంగా మహిళలు, యువత, విద్యార్థుల పక్షాన నిలబడేందుకు కవితక్క నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు.”
“గత మరియు ప్రస్తుత పాలకులు’నీళ్లు-నిధులు-నియామకాలు’ అనే ఆకాంక్షలను సక్రమంగా నెరవేర్చడంలో విఫలమయ్యారు. అందుకే ‘ప్రశ్నించు – పోరాడు – పరిష్కరించు’ అనే బలమైన నినాదంతో సామాజిక తెలంగాణను నిర్మించేందుకు ఇంటి పార్టీ అవసరం ఏర్పడింది. ఏప్రిల్ 25న మేడ్చల్ (మునీరాబాద్) లో జరగబోయే ఈ చారిత్రాత్మక పార్టీ ఆవిర్భావ సభకు రంగారెడ్డి జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం నుండి మహిళలు, రైతులు, విద్యార్థులు మరియు యువకులు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వేదభవాని సాయి, కప్పాటి శివరామకృష్ణా రెడ్డి, కార్యకర్తలు మరియు యువత పాల్గొని కవితక్క నాయకత్వానికి జై కొట్టారు.
కప్పాటి పాండురంగా రెడ్డి
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు











