దిశ పవర్ జనగామ: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కడకంచి బాలమణి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జనగామ పట్టణంలోని 5వ వార్డులో గురువారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడం ఒక్కటే కాకుండా వాటిని క్రమం తప్పకుండా సంరక్షించి, పెరిగే వరకు బాధ్యతగా చూసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు.పచ్చదనం పెంపొందితే ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో చెట్ల సంఖ్యను పెంచేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.వన మహోత్సవం సందర్భంగా వార్డులో వివిధ రకాల మొక్కలను నాటి, వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వన మహోత్సవం ప్రాధాన్యతను వివరించారు.











